హుద్‌హుద్ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్లు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2014లో హుద్‌హుద్ తుఫాన్ విలయం సృష్టించింది. తుఫాన్ బీభత్సానికి చాలామంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. అలాగే టెక్కలిలో రోడ్ల విస్తరణ సమయంలో మరికొంతమంది ఇళ్లు కోల్పోయారు. వీరందరి కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టెక్కలిలోని గోపినాథపురం సమీపాన కంకరబందలో 192 ఇళ్ల నిర్మాణానికిగానూ.. 2016 ఏప్రిల్ 14న అప్పటి కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. రూ.9.24 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణానికి రూ.7.68 కోట్లు, కాలనీలో మౌలిక సదుపాయాల కోసం రూ.1.53 కోట్లు కేటాయించారు. ఒక్కో ఇంటికి రూ.3.98లక్షలు చొప్పున గృహ నిర్మాణ శాఖ నిధులు కేటాయించింది. నిర్మాణాలు పూర్తయి.. ఇళ్ల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలో 2019 సార్వత్రిక ఎన్నికల కోడ్ సమీపించింది. దీంతో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదు. విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు బ్రేక్ పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హుద్‌హుద్ ఇళ్ల కేటాయింపుపై నిర్లక్ష్యం చేసింది. మౌలిక సదుపాయాల కల్పననూ పట్టించుకోలేదు. వరుసగా వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు మారుతూ ఉండడంతో హుద్‌హుద్ ఇళ్లకు బాలారిష్టాలు తప్పలేదు. కాగా.. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో.. ఎట్టకేలకు 2023 నవంబరు 30న ఆదరబాదరాగా 90 మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ వాణి సమక్షంలో అప్పటి సబ్‌కలెక్టర్ నూరుల్‌కమర్ పర్యవేక్షణలో డ్రా తీసి.. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. కానీ ఇప్పటివరకూ విద్యుత్, తాగునీటి సౌకర్యాలు, మరమ్మతుల వంటి పనుల ఊసే లేదు. కాగా.. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకే ఈ ఇళ్లను కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నాయకులు స్ధానికేతరులకు ఒక్కో ఇల్లు రూ.5లక్షలకు విక్రయించారని, దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పలు సమావేశాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు.