ఇంటర్ చదువుతున్న ఆ యువకుడు.. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సరదాగా చేసుకున్నాడు. శుక్రవారం మిత్రులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లాడు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగగా.. అలల తాకిడికి కొట్టుకుపోయాడు. పోలీసులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నా ఆ యువకుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వజ్రపుకొత్తూరుకు చెందిన జంగం తరుణ్(16).. కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో శుక్రవారం మిత్రులతో కలిసి వజ్రపుకొత్తూరు సముద్ర తీరానికి వెళ్లాడు. సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా అలల ఉధృతికి కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గ్రామస్థులు తీరానికి చేరుకుని స్థానిక మత్స్యకారుల సహాయంతో సముద్రంలో గాలించారు. మరోవైపు వజ్రపుకొత్తూరు, భావనపాడు మెరైన్ పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలించినా తరుణ్ ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు హేమంత్, తులసీ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హేమంత్ కూడా ప్రైవేటు ఉద్యోగం చేసి చిన్న కుమారుడు తరుణ్‌ను చదివిస్తున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ బి.నిహార్ తెలిపారు.