తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సెక్యూరిటీ సిబ్బంది తిరుమలకు పంపుతున్నారు. రేపటి (జనవరి 19) తో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈనెల 10 నుంచి 19 వరకు అంటే దాదాపు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. రేపు అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను టీటీడీ మూసివేయనుంది.ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. కేవలం దర్శనం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు ముందుగానే భక్తులకు టోకెన్లు, టికెట్లను కూడా టీటీడీ జారీ చేసింది. గత తొమ్మిది రోజులుగా టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలో శని, ఆదివారాలకు సంబంధించి 50వేల టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. అలాగే ఆన్లైన్లో 15వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా జారీ చేసింది.