రథసప్తమి వేడుకలను శోభాయమానంగా నిర్వహించాలని శ్రీకాకుళం జిల్లా అధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలి సి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలను గుర్తించాలని, 27న జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సూర్య నమస్కారాలు చేయించాలన్నారు. వచ్చే నెల 2న 80 అడుగుల రోడ్డులో ఉదయం 8 గంటలకు సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీని బాధ్యతలను ఆయుష్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జగదీష్‌కు కలెక్టర్ అప్పగించారు. 2, 3 తేదీల్లో ఉదయం 10 గంటలకు మున్సిపల్ గ్రౌండ్‌లో వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించాలని డీఎస్‌డీవోను ఆదేశించారు. 3న 80 అడుగుల రోడ్డులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వీటిని సంప్రదాయం స్కూల్ డైరెక్టర్ స్వాతి సోమనాథ్ పర్యవేక్షించాలన్నారు. పార్కింగ్ ఏర్పాట్లను డీఎస్పీ సీహెచ్ వివేకానంద చూడాలన్నారు. 3న లేజర్ షో, హెలికాప్టర్ టూరిజం వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.