కృష్ణానది వరద ముంపును అరికట్టడానికి విజయవాడ వైపున రక్షణ గోడ మాదిరిగానే గుంటూరు జిల్లాలోని సీతానగరం, తాడేపల్లి వైపు కూడా రెండో రక్షణ గోడను నిర్మించనున్నారు. దీనికి మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీన కృష్ణానదికి భారీగా వరద వచ్చింది. సుమారు 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీని తాకింది. అయితే, విజయవాడ వైపు ఉన్న ప్రాంతాలపై పెద్దగా కృష్ణానది వరద ప్రభావం కనిపించలేదు. కానీ, సీతానగరం ఘాట్లపై నుంచి సిమెంట్ రహదారి పైకి నీరు చేరింది. కనకదుర్గ వారధికి అవతలి వైపున ఉన్న విజయవాడ క్లబ్ ప్రహరీని తాకింది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న కరకట్టలు బలహీన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీతానగరం వైపు రక్షణ గోడను నిర్మించాలని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్యారేజీ దిగువన సీతానగరంలోని రైల్వేబ్రిడ్జి నుంచి వారధి వరకు 2.160 కిలోమీటర్ల మేర గోడను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి రూ.294.20 కోట్ల వ్యయమవుతుందని అంచనాలు రూపొందించగా, మంత్రివర్గం ఆమోదం తెలిపింది.