టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారన్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుల ఎదిగారని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకు రాగలిగారని.. బీసీలకు రాజకీయ అవకాశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీఆర్ నోటి నుంచే అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించింది ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడైన ఎన్టీఆర్ ఆనాడు దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను పునికి పుచ్చుకొని చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారన్నారు. ‘‘నాకు ప్రాణం తెలుగుదేశం పార్టీ. నా జీవితం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అంకితం’’ అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.