పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార విధానాలను అవలంబించినందుకు ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండి యా నుంచి విజయవాడ రైల్వేస్టేషన్‌కు ‘ఈట్ రైట్‌స్టేషన్’ ధ్రువీకరణ లభించింది. అన్నవరం, గుంటూరు, నడికుడి, హైదరాబాద్‌లోని నాంపల్లి స్టేషన్ తర్వాత ఎస్ఈఆర్ జోన్ లో ఐదో స్టేషన్‌గా, విజయవాడ డివిజన్లో రెండోదిగా విజయవాడ రైల్వేస్టేషన్‌గా నిలిచింది. 85 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి 5స్టార్ గుర్తింపు పొందింది. విజయవాడ నుంచి రోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించటానికి ఫుడ్ సేఫ్టీ, ట్రైనింగ్ సర్టిఫికేషన్‌లో ఇక్కడి స్టాళ్ల యజమానులు, కేటరింగ్ విక్రేతలు ఆహారాన్ని రవాణా చేసేవారు శిక్షణ పొందారు. విజయవాడ రైల్వే హాస్పిటల్ చీఫ్ సూపరింటెండెంట్ ఎం.శౌరిబాల ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ బృందం పలు పర్యాయాలు కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రమాణాలు, విక్రయదారుల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఉత్పత్తుల గడువు తేదీలు, శీతోష్ణస్థితి, ఉష్ణోగ్రత విధానాలు, చెత్తను పారవేయడం, తడి, పొడి చెత్త విభజనపై నిరంతర పర్యవేక్షణ జరిగింది. ప్రారంభంలో ఫ్రీ ఆడిట్‌ను కూడా నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఎం ప్యానెల్ థర్డ్ పార్టీ ఆడిట్‌ను నిర్వహించింది. ఆరు నెలల పాటు పూర్తి పర్యవేక్షణ, అధ్యయనం తరువాత ఈ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సర్టిఫికెట్ 2027 జనవరి వరకు అమలులో ఉంటుంది. సిబ్బందిని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, డాక్టర్ శౌరిబాల, వావిలపల్లి రాంబాబు, ఎండీ ఆలీఖాన్, ఎం.శైలజ, కె.అనిల్‌కుమార్, రహంతుల్లా అభినందించారు.