ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటనపై స్థానిక సీల్దా కోర్టు నేడు తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది.ఈనేపథ్యంలో మృతురాలి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు కోర్టులో జరుగుతున్న విచారణకు సీబీఐ తమని పిలవలేదని పేర్కొన్నారు. తమ లాయర్ కూడా కోర్టుకు వెళ్లొద్దని చెప్పారని తెలిపారు. దర్యాప్తు చేపట్టిన నాటినుంచి సీబీఐ అధికారులు ఒకటి, రెండుసార్లు మాత్రమే తమ ఇంటికి వచ్చారన్నారు. విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నిస్తే.. జరుగుతోందని మాత్రమే చెప్తున్నారని ఎటువంటి వివరాలు తమకు తెలియజేయట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు.తమ కూతురి గొంతుపై గాయాలున్నా స్వాబ్ సేకరించలేదని.. కేసు ఛేదించడానికి సీబీఐ ఎక్కువగా ప్రయత్నించడం లేదని ఆరోపించారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా డీఎన్‌ఏ రిపోర్టులో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసుపై నేడు తీర్పు వెలువడనుంది.ఘటనపై విచారణ చేస్తున్న కోల్‌కతా పోలీసులు కేసును తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆగస్టు 13న కోల్‌కతా పోలీసుల నుంచి కేసును సీబీఐ స్వీకరించింది. దర్యాప్తులోభాగంగా దాదాపు 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. దీనిలోభాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్ పేరును మాత్రమే చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.