పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో ఆయన పర్యటించారు. ‘స్వచ్ఛత దివస్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు.‘‘ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చింది. పరిసరాలను శుభ్రంగా ఉంచటం అనేది ఏ ఒక్కరి వల్లో అయ్యేది కాదు.. అందరూ బాధ్యత తీసుకోవాలి. పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు ఆకాంక్ష. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేది తేలికైన విషయం కాదు. వెంటనే అద్భుతాలు ఆశించలేం కానీ.. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు’’ అని పవన్ అన్నారు.