గుంటూరు నగర పరిధిలోని కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కుక్కల చర్మంపై గాటు పెట్టి ఆపరేషన్లు చేసినట్లు చూపడం.. అనుభవం లేని పశువైద్యులతో ఆపరేషన్లు చేయించడం.. ఆ తర్వాత తగిన చికిత్స అందించకపోవడంతో వందలాది కుక్కలు మృత్యువాతపడ్డాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు స్వాహా అయినట్లు తెలుస్తోంది. దీనిపై ‘స్నే’ యానిమల్ వెల్ఫేర్ సొసైటీకి డబ్బులు చెల్లిస్తున్న కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, పశుసంవర్థక శాఖ కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో 2024 జూన్ 13న యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా నడిచిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర జంతు కల్యాణ మండలికి ఫిర్యాదులు వెళ్లాయి. తనిఖీలు చేపట్టిన కేంద్రం బృందం.. కుక్కలకు ఆపరేషన్లు చేసే కేంద్రాన్ని డంపింగ్ యార్డు వద్ద నిర్వహించడంపై ఆక్షేపించింది. అసలు ఎన్ని కుక్కలకు ఆపరేషన్లు చేశారనే దానిపై రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని గుర్తించింది. ఏబీసీ రూల్ 17 ప్రకారం అవయవాల లెక్క వేయలేదని నిర్ధారించారు. నిబంధనలు పాటించని కారణంగా స్నే సంస్థ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ లేఖను జంతు సంక్షేమ బోర్డ్ డిసెంబరు 24న కార్పొరేషన్‌కు పంపింది. అయినా అదే సంస్థతో గుంటూరు నగర పాలక సంస్థ ఇంకా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తూ ఉండటం మరింత విమర్శలకు తావిస్తోంది.