ఎల్‌నినో ప్రభావం, వాతావరణంలో మార్పులు, సముద్రాలు వేడెక్కడం తదిత ర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. పారిశ్రామిక విప్లవానికి పూర్వం(1850-1990) నమోదైన సగటు కంటే 2024లో ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 1.55 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. గడచిన పదేళ్ల లో అసాధారణంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరు వాతావరణ సంస్థల అధ్యయనం మేరకు ఇప్పటి వరకు నమోదైన అత్యధిక వార్షిక సగటు ఉష్ణోగ్రతలను అధిగమించి 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 42 వేడిగాలుల రోజులు నమోదైన విషయాన్ని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) గత నెలలోనే వెల్లడింది. భారత్‌లోనూ 2024 అత్యంత వేడి సంవత్సరమని పేర్కొంది. తాజా పరిస్థితి నేపథ్యంలో 2025 నుంచి వేడి తగ్గించడానికి ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని ప్రపంచ వాతావరణ సంస్థ పిలుపునిచ్చింది. వాతావరణ విపత్తుల నివారణకు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాల్సి ఉందని స్పష్టం చేసింది. ఐరోపా, జపాన్, అమెరికా, ఇంగ్లండ్ వాతావరణ సంస్థలతోపాటు బర్కిలీ ఎర్త్‌లోని క్లైమాటిక్ రీసెర్చి యూనిట్, ఇంకా మరో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 2024ను అత్యంత వేడి సంవత్సరంగా గుర్తించారు. ఏకంగా పదేళ్లపాటు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఆందోళ న కలిగిస్తున్న వాతావరణం, సముద్రమట్టాలు పెరగ డం, కరుగుతున్న మంచు, రికార్డుస్థాయిలో పెరుగుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల 2024 అత్యంత వేడి సంవత్సరమని ప్రపంచ వాతావరణ సంస్థ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో అభివర్ణించారు.