శ్రీకాకుళం జిల్లాలో చాలా గ్రామాల్లో ఫ్లోరైడ్ ప్రభావంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటిలో మోతాదుకి మించి ఫ్లోరైడ్ ఉండడంతో పలు వ్యాధుల బారిన పడుతున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లోరైడ్పై రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వే నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని 24 మండలాల్లో 102 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అధికంగా వ్యాధులతో బాధపడుతున్న ప్రజలతోపాటు పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రక్త పరీక్షలు చేశారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి పరీక్షలు చేసి ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు గుర్తించారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, నైట్రైడ్ ఐరన్, ఆర్గానిక్ లాంటి రసాయన అవశేషాలు నిర్దేశిత పరిమితికి మించి ఉంటే ఫ్లోరోసిస్, కేన్సర్, కిడ్నీ, చర్మ, ఇతర వ్యాధుల బారినపడే పడే అవకాశం ఉంది. ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న గ్రామాల్లో చాలామంది దేహంపై మచ్చలు కనిపిస్తున్నాయి. మోకాళ్లు, నడుము వంగకపోవడం, మెడ తిప్పలేకపోవడం వంటి ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాఖ సర్వే ఆధారంగా బాధితులకు నెక్, లాంబర్ బెల్స్ట్, వాకర్స్, వీల్‌చైర్స్, ఫోల్డబుల్ టాయిలెట్స్, ఇతర ఉపకరణాలు అందజేయనున్నారు.