కల్లు గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. కుల వృత్తినే నమ్ముకుని, ఇబ్బందులు పడుతున్న గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయించడం చారిత్రక నిర్ణయిమన్నారు. కాగా.... గీత కులాలవారికి 335 మద్యం షాపులను రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని విడుదల చేసింది. ఆ షాపుల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలను పేర్కొంటూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కె.మీనా మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 2016లో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వే ప్రామాణికంగా గీత కులాల జనాభాను పరిగణనలోకి తీసుకుని.. ఆయా జిల్లాల్లో గీత ఉప కులాలవారికి వేర్వేరుగా మద్యం షాపులను కేటాయించారు.