ప్రకాశం జిల్లాకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. అధికారంలోకి వచ్చిన తొలినెలలోనే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష చేసినప్పుడు వెలిగొండపై సమగ్ర నివేదికతోపాటు పనుల పూర్తికి నిర్ధిష్ట ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆపై ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రాజెక్టును సందర్శించారు. మంత్రులు స్వామి, గొట్టిపాటి రవికుమార్‌తోపాటు జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులతో కలిసి టన్నెల్ తవ్వకాలు, ఫీడర్ కాలువలు, పునరావాస కాలనీలను చూశారు. అధికారులతో సమీక్ష చేశారు. 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 15లక్షల మందికి తాగునీరు అందించేందుకు చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులను రెండు దశల్లో పూర్తికి ఏడు ప్యాకేజీలతో చేపట్టారని అధికారులు ఆయనకు చెప్పారు. రూ.8,043కోట్లు మంజూరు కాగా రూ.6,059 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అందులో పనుల కోసం రూ.4,987 కోట్లు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, ఇతరత్రా మరో రూ.1,100 కోట్లు ఖర్చుచేశామన్నారు. మొత్తం ప్రాజెక్టు పూర్తికి మరో రూ.1,700 కోట్లు అవసరమవుతాయని మంత్రికి నివేదించారు. తద్వారా ప్రాజెక్టు వ్యయం రూ.9,741 కోట్లకు చేరుతుందని వివరించారు.