సీఆర్డీయే పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎయిరిండియా సిఈవో క్యాంప్ బెల్ విల్సన్ ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. దుబాయ్ తరహాలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి విమానాశ్రయం గ్లోబల్ ఏవియేషన్‌లో కీలకపాత్ర వహించటంతో పాటు ఏపీకి అంతర్జాతీయ ట్రాఫిక్, పెట్టుబడులు వస్తాయని లోకేష్ అన్నారు. అలాగే విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రాంతీయ మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్ హబ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సదుపాయం కల్పించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమేగాక ఎయిరిండియా కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. ప్రతిపాదిత హబ్‌తో ఉపాధి అవకాశాలు కలగటంతో పాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పైలట్లు, స్టీవార్డెస్, టెక్నికల్ టీం కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.