ఎన్నికలకు ముందు రకరకాల హామీలతో ఉద్యోగులకు మాయ మాటలు చెప్పిన కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక బొత్తిగా పట్టించుకోవడం మానేశారని, ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా మేనిఫెస్టోలో ప్రకటించిన 9 హామీల్లో కనీసం ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు నలమారు చంద్రశేఖర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వమే రూ.26 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఇస్తామన్న రూ.1300 కోట్లు, పండగ ముగిసి వారమైనా విడుదల చేయలేదని ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగులకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదు. మేనిఫెస్టోలో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటిని అధికారంలోకి రాగానే నెరవేరుస్తామన్నారు. కానీ, మాట నిలబెట్టుకోలేదు. పాత పీఆర్సీ బకాయిలు, ఇతర బకాయిలు, లీవ్ ఎన్క్యాష్మెంట్, ఈఎల్స్ ఎన్క్యాష్మెంటు, జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ (ప్రభుత్వ బీమా), మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్.. వంటివి దాదాపు రూ.26 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వెంటనే అవన్నీ చెల్లించాలి. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు రూ. 1300 కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్భాటంగా ప్రకటించినప్పుడు మా డబ్బులు మాకివ్వడం కూడా గొప్పేనా అని ఆశ్చర్యపోయాం. సంక్రాంతి ముగిసి వారం దాటినా ఉద్యోగులకు చెల్లించిన పాపాన పోలేదు. సంక్రాంతి కానుక కింద రూ.250 కోట్లు టీడీఎస్ ఇస్తున్నామని మంత్రి ప్రకటించినప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి ఉద్యోగులది. ఎందుకంటే ఆదాయపు పన్ను కట్టే ప్రభుత్వ ఉద్యోగులకు టీడీఎస్ కట్ కాదు. మరి ఆ డబ్బు ఎవరికి చెల్లిస్తున్నారో ఎందుకు చెల్లిస్తున్నారో అయోమయం నెలకొంది అని అభిప్రాయపడ్డారు .