ప్రైవేటీకరణ మీద మమకారంతో పీ4పేరుతో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రం 2450 మెడికల్ సీట్లు కోల్పోయిందని, మెడిసిన్ చదవాలన్న పేద విద్యార్థుల కలలు కల్లలయ్యాయని వైయస్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఎవరైనా రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటుకైనా పోరాడుతారు.. కానీ సీట్లను వద్దనే ప్రభుత్వం ఏపీలో ఉండటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అన్నారు. సేఫ్ క్లోజ్ పేరుతో కూటమి ప్రభుత్వ మూసేసిన మెడికల్ కాలేజీలను త్వరలోనే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సందర్శించి వాటి నిర్మాణ నైపుణ్యం, స్థితిని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు హామీలకు గ్యారెంటీ అని ఎన్నికలకు ముందు ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ప్రైవేటీకరణల పరంపరపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని సీదిరి ప్రశ్నించారు.