గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేసేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అధికారులకు సూచించారు. తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె ఊరుచింతల, తలారిచెరువు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కడా అపరిశుభ్రత లేకుండా ఉండేటట్లు చూడాలని తెలిపారు. కొందరు గ్రామస్థులు వివిధ సమస్యల్ని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో ఆయన ఆయా అధికారులను పిలిపించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పట్టణంలోని సుంకులమ్మపాలెం, గణే్‌షనగర్ తదితర కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలపై ఆరాతీశారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆయన వెంట కౌన్సిలర్లు, అధికారులు, టీడీపీ నాయకులు ఉన్నారు.