రహదారిపై ప్రయాణించే ప్రతీ ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించాలని, రహదారి భద్రతే జీవితానికి రక్షణ అని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రవాణా భద్రతా మాసోత్సవాలు, రహదారుల భద్రతా సమన్వయం కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో అనేకచోట్ల రోడ్డు భద్రతపై వివిధ కార్యక్ర మాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ఉన్న రహదారులు, సర్వీసు రోడ్లు, స్పీడ్ బ్రేకర్స్ తదితర అంశాలపై ఆరా తీశారు. రోడ్డు భద్రతా చర్యలపై ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని, రోడ్డుపై మార్కింగ్, సైన్ బోర్డులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఉప రవాణా కమిషనర్ విజయసారధి, ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ వివేకానంద, డీపీవో భారతి సౌజన్య, నేషనల్ హైవే అథారిటీ పీడీ తివారీ, ఎంవీఐ గంగాధర్, ట్రాఫిక్ పోలీసు, రవాణాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.