బిల్లుల మంజూరు, ఖర్చుల విషయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని రాష్ట్ర ఫైనాన్స్ కార్యాలయ ఏఏవో ఎన్.రమ్యప్రసన్న పేర్కొన్నారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ సమావేశపు మందిరంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా ఆధ్వర్యంలో సమగ్రశిక్ష ఐటీ సిబ్బంది, మండలస్థాయి అక్కౌంటెంట్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. శిక్షణలో ముఖ్య అతిథిగా రమ్యప్రసన్న మాట్లాడుతూ ప్రతీనెల పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలతో పాటు ఉద్యోగుల జీతభత్యాలకు ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులను సక్రమంగా సమర్థవంతంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకుంటే ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతుందన్నారు. ఈశిక్షణ శిబిరాన్ని సమగ్ర శిక్ష ఫైనాన్స్ అండ్ అక్కౌంట్ ఆఫీసర్ జి.ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర కార్యాలయం నుంచి విచ్చేసిన ఏఏవోలు ధూళిపూడి మనోహర్, పి.రవికుమార్ మాట్లాడుతూ జిల్లా, మండల కార్యాలయాలకు మంజూరయ్యే నిధులను ఖర్చు చేసే విధానం, రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌లో వ్యయ, జమల నిర్వహణ వంటి విషయాలపై శిక్షణ ఇచ్చారు. ఉత్తమ సేవలందిస్తున్న కాకినాడ జిల్లా సిస్టమ్ అనలిస్ట్ సత్యశిరోమణి, ఎఫ్‌ఏవో ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో దుశ్శాలువాలు, జ్ఞాపికతో సత్కరించారు. కాకినాడ ఏఎఫ్‌ఏవో వారణాసి పద్మావతి, సమగ్ర శిక్షా ఏపీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఐఈకోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, సమగ్ర శిక్ష కార్యాలయ సూపరింటెండెంట్ సమగ్రశిక్ష జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.