రాజమండ్రి విమానాశ్రయంలో టెర్మినల్ కూలిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు. కేంద్రం తరపున రామ్మోహన్ నాయుడు దావోస్ పర్యటనలో ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచే అధికారులతో మాట్లాడారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ, పౌర విమానయాన అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.కాగా.. రూ.200 కోట్ల వ్యయంతో గత డిసెంబర్ నుంచి ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి నూతన టెర్మినల్ భవనాలను పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈరోజు నూతన టెర్మినల్ భవనం నిర్మాణం వద్ద కార్మికులు పనిచేస్తున్న సమయంలో స్ట్రీల్ స్ట్రక్చర్‌కు సంబంధించి ఒక భాగం కిందపడిపోయింది. ఈ ఘటనలో గాయపడిన కార్మికుడిని రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. స్ట్రక్చర్ కూలిపోడానికి కారణాలపై, గాయాలపాలైన వారి పరిస్థితి ఏంటి అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.