కోవూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొడవలూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కోవూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వపు కక్ష సాధింపులో భాగంగా సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు చేయడం, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు మధ్యాహ్న భోజన నిర్వాహకులు రేషన్ డీలర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలను తొలగించడాన్ని నిరసిస్తూ మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డిలు కూటమి ప్రభుత్వ అక్రమాలు, అధికారుల నిర్వాకాలపై మండిపడ్డారు. పోలీసు కేసులకు భయపడమని, ప్రజల సమస్యలపై పోరాడుతామని హెచ్చరించారు.