ఐదేళ్ల విధ్వంస పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఏడు నెలల క్రితమే మొదలైందని రాష్ట్ర ఐటీ, మానవవనరుల మంత్రి లోకేశ్ అన్నారు. దావోస్‌లో సీఎన్‌బీసీ చానల్‌కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. దావోస్ కు రావడం వెనుక ప్రధానోద్దేశం ‘ఆంధ్ర ఈజ్ బ్యాక్’ అని చెప్పడమేనని తెలిపారు. జగన్ ఐదేళ్ల ఏలుబడిలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పుడా పరిస్థితులు లేవని చెప్పడానికే ఇక్కడకు వచ్చామన్నారు. ‘సన్ రైజ్ స్టేట్ ఏపీలో పెట్టుబడులకు అన్ని సానుకూలతలూ ఉన్నాయి. పెట్టుబడుల కోసం మేం పొరుగు రాష్ట్రాలతో కాకుండా పొరుగుదేశాలతో పోటీ పడుతున్నాం’ అని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని ఎలా అధిగమించబోతున్నారని అడుగగా.. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవడంలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి అనుభవం ఉందని, ఆ దిశగా ఇప్పటికే ఆయన ప్రయత్నాలు ప్రారంభించారని లోకేశ్ సమాధానమిచ్చారు. ప్రతికూలతలన్నీ అధిగమించి రాబోయే పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునివ్వడంలో రాష్ట్రం ముందుంటుందనడంలో అనుమానం లేదన్నారు. రాజధాని అమరావతి పనులు కూడా ఊపందుకుంటున్నాయని, ఇప్పటికే టెండర్లు పిలవడం పూర్తయిందని, ఫిబ్రవరి 1 నుంచి రాజధాని ప్రాంతంలో పనులు ఊపందుకుంటాయని వివరించారు. మరో మూడేళ్లలో కోర్ కేపిటల్ సిద్ధమవుతుందని చెప్పారు.