రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఓ దళిత సామాజికవర్గానికి చెందిన తహసీల్దార్‌పై చేసిన వ్యాఖ్యలు నంద్యాల జిల్లాలో వైరల్‌గా మారాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో రెండు రోజుల క్రితం సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాల భూమి పూజకు మంత్రి హాజరయ్యారు. స్థానికులు కొందరు నంద్యాల అర్బన్ తహసీల్దార్ ప్రియదర్శినిపై మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి ఫరూక్ తహసీల్దార్‌పై అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రజలకు పనిచేద్దామనే ఉద్దేశం ఆమెకు లేదు. ఆమెంతకు ఆమె తప్పించుకుని పోవాలి కదా? పోనీ బాధ్యతగా పనిచేయాలి కదా..? లేకుంటే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు చెప్పాను. పని చేయకపోతే ప్రజలకు ఎందుకు..? ప్రభుత్వం జీతం ఇస్తోంది కదా? బాధ్యతగా పనిచేయాలి. ఊరకనే ఆఫీసులో కూర్చొని, ఎవరు వచ్చినా పలకుండా, పనులు చేయకుండా ఉంటే ఏలా..’ అంటూ మంత్రి కామెంట్స్ చేశారు. అయితే మంత్రి మాట్లాడిన ఈ వీడియో క్లిప్పింగ్‌ను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ బాధ్యతగా పనిచేస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన తహసీల్దార్‌పై మంత్రి ఇలా మాట్లాడటం అవమానించడమేనని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా రెండు రోజుల తరువాత ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం.. అటు దళిత వర్గాలతో పాటు రెవెన్యూ ఉద్యోగుల్లోను చర్చకు దారి తీసినట్లయింది.