ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యం కానున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద గాలిలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా సేపు గాలిలోనే తిరుగుతూ ఉండిపోయింది. పొగమంచు కారణంగా గత రెండ్రోజులుగా ఉదయం వేళ విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా రోడ్లపై పొగమంచు దట్టంగా కమ్మేసింది. గన్నవరం జాతీయ రహదారిని మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనాలు సరిగా కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినా మంచు దుప్పటి వీడలేదు. అలాగే విజయవాడ-హైదరాబాద్ జాతీయపై పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దగ్గరికి వచ్చే వరకూ ఎదుటి వాహనాలు కనిపించకపోవడంతో బెంబేలెత్తిపోయారు. రహదారి సరిగ్గా కనిపించకపోవడంతో ముందుకు వెళ్లలేక కొంతమంది వాహనాలను రోడ్డు పక్కనే ఆపేస్తున్నారు. ఇక ఏలూరును సైతం పొగమంచు కమ్మేసింది. అర్దరాత్రి నుంచి పొగమంచు భారీగా కమ్మేసింది. ఈ విధంగా పొగమంచు కురవడం కొన్నేళ్లలో ఇదే మొదటిసారిని స్థానిక ప్రజలు చెబుతున్నారు.