రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తామని దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం తమ అసమర్థత కారణంగా ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆక్షేపించారు. అంతర్జాతీయ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ప్రదర్శనలో రాష్ట్ర బృందం విఫలమైందని ఆయన గుర్తు చేశారు. కేవలం ప్రచార యావకే పరిమితమై, పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ విశాఖపట్నం సిటీ ఆఫీస్‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ...... సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, పలువురు మంత్రులు, అధికారులు నాలుగు రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పర్యటనను పరిమితం చేసి, రాష్ట్రానికి రిక్త హస్తాలతో వారు తిరిగి వస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర రూ.8.5 లక్షల కోట్లు, తెలంగాణ రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తుంటే, చంద్రబాబు మాత్రం దావోస్ పర్యటన కోసం ఖర్చు చేసిన రూ.20 కోట్ల ప్రజాధనానికి పైసా విలువ కూడా లేకుండా చేశారు. దావోస్‌లో ఏటా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. అంతర్జాతీయంగా పెట్టుబడులకు అవకాశం ఉన్న చోట్ల ప్రాజెక్టలను ప్రారంభిస్తారు. అటువంటి దావోస్ వేదికను చంద్రబాబు, ఆయన కొడుకు తమ రాజకీయ ప్రసంగాలతో నవ్వుల పాల్జేశారు. సాక్షాత్తూ సీఎం అయిన చంద్రబాబు, తమ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, చాలా పేద రాష్ట్రంగా మిగిలిపోయిందని అంత పెద్ద వేదికపై చెప్పడం వల్ల ఏ పారిశ్రామికవేత్త అయినా, ఇక్కడ పెట్టుబడులకు ముందుకొస్తారా? ఇక రాష్ట్రానికి యువరాజులా వ్యవహరిస్తున్న మంత్రి లోకేష్, ఏకంగా భారత రాజ్యాంగానికి పోటీగా తాను సొంతంగా తయారు చేసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఆ వేదికపై నిసిగ్గుగా ప్రకటించడం చూసి ఎవరైనా ఈ రాష్ట్రంలో కాలు పెట్టేందుకు సాహసిస్తారా? పైగా నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, సీఎం ఇవ్వాలంటూ సహచర మంత్రులు అంతర్జాతీయ వేదికలపైన చేసిన భజన చూసి పారిశ్రామికవేత్తలే అవాక్కయ్యారు. ఇలాంటి వైఖరిని దావోస్ లో ప్రదర్శిస్తూ పారిశ్రామికవేత్తలతో సీఎం, అధికారులు ఎన్ని చర్చలు జరిపినా ఏ ఒక్కరూ పెట్టుబడులపై నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదు అని అన్నారు.