గత కొంతకాలంగా కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ)తో విభేదాల కారణంగా ఇటీవల టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో అతనికి చోటు దక్కకపోవడంపై స్పందించిన కేసీఏ అతనిలో క్రమశిక్షణ లోపించిందని, శిక్షణ శిబిరానికి కూడా డుమ్మా కొట్టడంతో విజయ్ హాజారే ట్రోఫీ కోసం కేరళ జట్టులో సైతం సంజూను చేర్చలేదని వెల్లడించింది. అయితే, కేసీఏ తీరుపై సంజూ తండ్రి విశ్వనాథ్ మండిపడ్డారు. కేరళ క్రికెట్ అసోసియేషన్ తన కుమారుడి కెరీర్‌ను అంతం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఇంతకుముందు జరిగిన ఓ సంఘటనను ఆయన ప్రస్తావించారు. రాహుల్ ద్రవిడ్ వల్లే సంజూ ఇప్పుడీ స్థాయిలో ఉన్నాడని అన్నారు. కేసీఏ అతడి కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆయనే కాపాడారని వెల్లడించారు. ద్రవిడ్ ఎలా తన కుమారుడి క్రికెట్ కెరీలో కీలక పాత్ర పోషించాడో ఆయన గుర్తుచేశారు. "అప్పుడు శాంసన్‌కు 11 ఏళ్ల వయస్సు. ఓసారి కేసీఏ నా కొడుకుపై యాక్షన్ తీసుకుంది. అతడి కిట్, ఇతర సామాగ్రి లాక్కుంది. ఆ టైమ్‌లో ద్రవిడ్ కాల్ చేయగానే సంజూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. బాధపడొద్దని, అంతా తాను చూసుకుంటానని ద్రవిడ్ ధైర్యం చెప్పాడు. ఎన్‌సీఏకి తీసుకెళ్లి శిక్షణ ఇచ్చాడు. లేకుంటే అప్పుడే సంజూ కెరీర్ ముగిసిపోయేది" అని విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం సంజూ శాంసన్ టీమిండియా టీ20 జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఓపెనర్‌గా అవతారం ఎత్తినప్పటి నుంచి భారీ ఇన్నింగ్స్ లతో జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అటు ఐపీఎల్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథిగా ఉన్న విషయం తెలిసిందే.