నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న చరణ్ కుటుంబాన్ని ఆ విద్యాసంస్థల యాజమాన్యంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లా, బత్తలపల్లిలోని చరణ్ నివాసానికి చేరుకుని తండ్రి వెంకటనారాయణను పరామర్శించారు. రాంభూపాల్ మాట్లాడుతూ అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు దుఃఖం మిగిలిస్తున్న కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలో ఫీజులు చెల్లించలేదని గంటల తరబడి విద్యార్థి చరణ్‌ను నిలబెట్టడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. కళాశాలకు కనీసం రక్షణ ఏర్పాట్లు ఉన్నాయా అనికూడా పరిశీలించకుండా అనుమతిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరమేష్, జిల్లా కార్యదర్శి నాగార్జున, ఉపాధ్యక్షుడు దామోదర్, ఎస్కేయూ అధ్యక్ష కార్యదర్శులు వంశీ, మోహన పాల్గొన్నారు.