ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయేల్‌కు బాంబులు.. విధ్వంసం తీవ్రతను ఆపేందుకు బైడెన్ నిషేధం ఎత్తేసిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2025, 08:17 PM

గాజాలో ఇజ్రాయేల్ విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గతంలో జో బైడెన్‌ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని తాజాగా డొనాల్డ్ ట్రంప్ పక్కనబెట్టారు. ఇజ్రాయేల్‌కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను సరఫరా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు ఓ వార్తా సంస్థకు వెల్లడించాయి. దీని ప్రకారం రాబోయే రోజుల్లో దాదాపు 18 వందల ఎంకే-84 బాంబులను ఇజ్రాయేల్‌కు అందజేయనున్నారు. వీటిని బంకర్‌ బస్టర్లు అని కూడా పిలుస్తారు. నిషేధం ఎత్తివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే టెల్‌అవీవ్‌కు పెంటగాన్‌ ప్రతినిధులు తెలియజేశారు.


గాజాలోని జనావాసాలపై ఈ బాంబులను ఇజ్రాయేల్ ప్రయోగిస్తున్నట్టు ఆందోళనలు వ్యక్తం కావడం.. ఇదే సమయంలో అమెరికాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వీటి సరఫరాపై జో బైడెన్ నిషేధం విధించారు. దీంతో అవి గౌడొన్లకే పరిమితం కాగా.. ఈ నిర్ణయంతో ఇజ్రాయేల్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ బాంబులను తామే స్వయంగా తయారుచేసుకోవాలని ఇజ్రాయేల్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కొన్ని రక్షణ సంస్థలకు కాంట్రాక్టులకు అప్పగించింది. నిజానికి గతంలో అమెరికాయే దాదాపు 10,000కుపైగా ఎంకే-84లను ఇజ్రాయేల్‌కు అందజేసింది.


బాంబులపై నిషేధం ఎత్తేసిన విషయాన్ని ట్రంప్ సైతం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. ‘‘ఇజ్రాయేల్ ఆర్డర్ చేసి, నగదు చెల్లించినా బైడెన్ అందజేయని చాలా వస్తువులు ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నాయి’ అని తెలిపారు. ఇంతకు మించి ఆయన ఎలాంటి వివరాలను బయటపెట్టలేదు. ఇక, అమెరికాలో ఇజ్రాయేల్‌ రాయబారి మైక్‌ హెర్జోగ్‌ ఇటీవల మాట్లాడుతూ... బైడెన్‌ నిర్ణయాన్ని ట్రంప్‌ రద్దు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎంకే-84 సరఫరాను పునరుద్ధరిస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


ఇదిలా ఉండగా.. హమాస్, ఇజ్రాయేల్ మధ్య శాంతి ఒప్పందం గతవారం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత 16 నెలలుగా కొనసాగుతోన్న కాల్పులు మోతతో దద్దరిల్లిన గాజాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి, స్వచ్ఛంద సంస్థల నుంచి మానవతాసాయం కింద సామాగ్రి తరలివెళ్తోంది. అలాగే, హమాస్ తమ చెరలోని బందీలను ఒక్కొక్కరిగా వదిలిపెడుతుంటే.. దీనికి బదులుగా తమ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయేల్ విడుదల చేస్తోంది. అక్టోబరు 7, 2023లో ఇజ్రాయేల్‌లోకి చొరబడిన హమాస్ సాయుధులు.. మారణహోమానికి పాల్పడి 1,200 మందిని ఊచకోత కోసి.. మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీనికి ప్రతీకారంతో రగిలిపోయిన ఇజ్రాయేల్.. గాజాలోని హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. ఈ రక్తపాతంలో 47 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com