శ్రీకాకుళం నగరం న్యూకాలనీలో వివాహిత హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇద్దరి మధ్య రూ.500 కోసం ఘర్షణ జరగ్గా.. ఆమెను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి.. రూ.1.65లక్షల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను.. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ కేవీ రమణ వెల్లడించారు. పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన వివాహిత (53) శ్రీకాకుళం నగరంలో జరిగే సుందర సత్సంగానికి తరచూ వస్తుండేది. ఈ క్రమంలో సత్సంగానికి వచ్చే అండలూరు శరత్‌కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు వివాహిత దుస్తులు కొనేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి శ్రీకాకుళం వచ్చింది. శరత్‌కుమార్‌కు ఫోన్ చేసి న్యూకాలనీలోని అతని నివాసానికి 2.44 గంటలకు చేరుకుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య రూ.500 కోసం వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో శరత్‌కుమార్ తల్లిని వివాహిత నిందించింది. దీంతో శరత్ ఆవేశంతో పక్కనే ఉన్న విద్యుత్ తీగను ఆమె మెడకు చుట్టి, తలగడను ముఖంపై అదిమిపెట్టడంతో ఊపిరాడక మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో పడేసి, ఒంటిపై ఉన్న 82 గ్రాముల బంగారు ఆభరణాలను, మృతురాలి సెల్‌ఫోన్‌ను తీసుకుని, ఇంటికి తాళం వేసి శరత్‌కుమార్ పారిపోయాడు. వివాహిత భర్త ఎంత ఫోన్ చేసినా, సమాధానం రాకపోవడంతో ఆమె కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెతికారు. ఈ నేపథ్యంలో వివాహిత వాహనం న్యూకాలనీలోని ఓ ప్రైవేటు కళాశాల వద్ద కనిపించడంతో ఆమె కోసం చుట్టుపక్కలా ఆరా తీశారు. వివాహిత తరచూ సమీపంలోని ఓ ఇంటికి వస్తుంటారని స్థానికులు చెప్పడంతో, వారు అక్కడకు వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఫుటేజీలు పరిశీలించగా వివాహిత అక్కడకు వచ్చినట్లు గుర్తించారు. దీంతో రెండో పట్టణ పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. వివాహిత బాత్రూమ్‌లో విగతజీవిగా పడి ఉంది. పోలీసులు శరత్‌కుమార్ కోసం గాలించగా ఈ నెల 20న పట్టుబడ్డాడు. దర్యాప్తులో హత్యకు సంబంధించిన వివరాలను సేకరించారు. రూ.1.65లక్షలు విలువైన 82 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ఏఎస్పీ కేవీ రమణ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐలు సంతోష్, రామారావు, హెచ్‌సీ శివాజీ, పీసీలు ప్రకాష్, ఆదినారాయణ, త్రినాథరావు, రమేష్‌ను ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ(క్రైం) పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, రెండవ పట్టణ సీఐ పి.ఈశ్వరరావు పాల్గొన్నారు.