కొల్లేరు చెరువుల ధ్వంసంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలు జీవన పరిస్థితులను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లి ప్రజలను రక్షించుకునే పనిచేస్తాం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. రైతులు ముసుగులో కొల్లేరులో బయట వ్యక్తులు చేపల సాగు చేస్తున్నారని కొంతమంది అపవాదులు సృష్టి స్తున్నారు. వీటిని తిప్పికొట్టేందుకు కోర్టులో వాదనలు వినిపించాల్సిన అవసరముంది. ఒకసారి కాంటూరు కుదింపు చేసి సరిహద్దులు నిర్ధారణ చేస్తే దానికి లోబడి సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకుంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం.కొల్లేరులో పర్యావరణం పేరుతో ఎవరు కేసులు వేసినా వెంటనే చెరువులను ధ్వంసం చేస్తామంటున్నారు. అరకు అటవీ శాఖ ప్రాంతంలో ఉన్నప్పటికీ కాఫీ పంటను పండించుకునే హక్కు ఉన్నప్పుడు కొల్లేరులో ధ్వంసం చేసిన చెరువుల్లో చేపలు పెంచుకునే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. మార్చి 31వ తేదీ నాటికి చెరువులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేయాలి. భూములను ఆక్రమించుకోవడం లక్ష్యం కాదని ప్రజలు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా కాంటూరు కుదింపు చేయాలి. కొల్లేరు ప్రజలతో కలసి కాంటూరు కుదింపునకు కృషి చేస్తా. 15 వేల జిరాయితీ భూములను, కొల్లేరు ఆపరేషన్ లో అక్రమంగా ధ్వంసం చేసిన 7500 ఎకరాలను ప్రజలకు ఇప్పించేవరకు పోరాటం చేస్తాం అన్నారు.