ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు ఒకే దగ్గరికి వచ్చినా ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ నగర్‌లో వారంతా స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నారు. అందుకు మియావాకి అనే జపాన్ టెక్నిక్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉపయోగించింది. అయితే ఈ మహా కుంభమేళా కోసం యోగి సర్కార్ రెండేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించింది. ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ మియవాకి అనే జపనీస్ టెక్నాలజీతో ప్రయాగ్‌రాజ్ పరిధిలో చిట్టడవిని రూపొందించింది. ప్రయాగ్‌రాజ్ నగరంలోని 10 ప్రాంతాల్లో 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకుపైగా 63 రకాల మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు పెరిగి ఇప్పుడు చెట్లుగా మారడంతో నిత్యం ఆ లక్షలాది చెట్లు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి.
ఇక ఈ మియవాకి టెక్నిక్‌తో లక్షలాది చెట్లను పెంచడంతో అది సాకారం చేయడానికి ప్రయాగ్‌రాజ్ మున్సిపాలిటీ దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేసింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటి.. పెంచడమే ఈ మియవాకి టెక్నిక్ ప్రత్యేకత. ఈ ప్రాజెక్టులో మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితర 63 రకాల చెట్లను పెంచారు. ఇక ఈ లక్షలాది చెట్ల నిర్వహణ కాంట్రాక్టును 3 ఏళ్ల కాల వ్యవధికి ఒక కంపెనీకి ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పగించారు.