ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లిస్తే నంద్యాలను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో శుక్రవారం మంత్రి ఫరూక్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నంద్యాలలో ఉన్న సుమారు 31 వార్డులలో రూ.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. మున్సిపాలిటీకి దాదాపు రూ.15 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, కోర్టుకు వెళ్లిన వారు పన్నులు చెల్లిస్తే నంద్యాల అభివృద్ధికి సహకరించిన వారవుతారని అన్నారు. దేవనగర్ నుంచి పద్మావతీనగర్ (కుందూ నది), శ్రీరామ థియేటర్ పక్కన ఒక బ్రిడ్డి కావాలని ప్రజలు కోరుతున్నారు, నిధులు వస్తే ఆ బ్రిడ్జిలు కడుతామని అన్నారు. నంద్యాలను శాటిలైట్ టౌన్‌గా తయారు చేయాలన్న ఉద్దేశంతో నందమూరి నగర్‌లో, ఎన్‌జీవో కాలనీలో స్థలం కేటాయించినారన్నారు. పెండేకంటి వెంకటసుబ్బయ్య, అయ్యపురెడ్డి గారు సహకారంతో ఈ స్థలాన్ని సేకరించారని చెప్పారు. ఈ సందర్భంగా వీరిని మంత్రి స్మరించుకున్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.