బొబ్బిలి యుద్ధం పౌరుష, పరాక్రమాలకు మారుపేరుగా నిలిచిందని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజును హత మార్చిన తాండ్రపాపారాయునికి రాజవంశీ యులు, ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడులు శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. స్థానిక బజారు సెంటరులో గల తాండ్రపాపారాయుడి విగ్రహానికి పూలమాలలు వేశారు. తొలుత భైరిసాగరం చెరువు గట్టుపై గల యుద్ధ స్మారక స్తంభం వద్ద వీరులకు స్మృత్యంజలి ఘటించారు. బొబ్బిలి కోట తూర్పుదేవిడి ముందు గల ఆఖరి పట్టాభిషిక్తుడైన రాజా రంగారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ కేవలం 250 మంది సైనికులు వీరోచితంగా 15 వేల మంది శత్రు సైనికులతో తలపడినందునే అది చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన బీసీ కులాల రాష్ట్ర నేత మాకిరెడ్డి భాస్కరరావు, వెంకటగిరికి చెందిన చేనేత కార్మిక ప్రతినిధులు, పట్టణ, మండల టీడీపీ అధ్యక్షులు రాంబార్కి శరత్ బాబు, వాసిరెడ్డి సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు, అల్లాడ భాస్కరరావు, నంబియార్ వేణుగోపాలరావు, గంటి గోపాలకృష్ణ శర్మ, సుంకరి సాయిరమేష్, నంది హరి, పసుపురెడ్డి లక్ష్మణరావు, సాలా వసంత్ తదితరులు పాల్గొన్నారు.