నగరి మండల పరిదిలోని ఎం.కొత్తూరు ఉన్నత పాఠశాలకు శుక్రవారం ఉదయం గ్రామస్తులు తాళం వేసి నిరసన తెలిపారు.మాంగాడు దళితవాడకు చెందిన కొంతమంది పిల్లలు తమ ఊరి పిల్లలను తరచూ వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నారని....కాబట్టి తమ ఊరిలో అసలు స్కూలే వద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోకి ఉపాద్యాయులను,విద్యార్థులను పంపకపోవడంతో కొంతమంది టీచర్లు పోలీసులకు సమాచార మందించారు. సీఐ మహేశ్వర్ సిబ్బందితో కలిసి పాఠశాల వద్దకు చేరుకుని గ్రామస్తులతో చర్చించారు.పాఠశాలలో చదువుతున్న మాంగాడు దళితవాడకు చెందిన 10మంది విద్యార్థులు గురువారం ఎం.కొత్తూరుకు చెందిన విద్యార్థులను వారి ఇంటి వద్దకు వెళ్లి కొట్టడమే గాక మహిళలను నానా బూతులు తిట్టారని గ్రామస్తులు వివరించారు.గురువారం పాఠశాలలో జరిగిన చిన్నపాటి వివాదంతో ఓ విద్యార్థి ప్రహరీ దూకి బయటకు వెళ్లి గ్రామస్తులకు ఫోన్ చేయడంతో వారు ఎం.కొత్తూరుకు వచ్చి విద్యార్థుల ఇళ్లలోకి దూరి మరీ కొట్టారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో సైతం ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులకు చెప్పినా సర్దిచెప్పి పంపేశారని గుర్తు చేశారు. టీచర్లు సైతం ఆ పిల్లలకు భయపడే పరిస్థితి ఉండడంతో పాఠశాలే తమ గ్రామంలో వద్దన్నారు.అయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఐ హామీ ఇవ్వడంతో శాంతిం చిన గ్రామస్తులు పాఠశాల గేట్లు తెరిచారు. ఒకప్పుడు 100శాతం ఫలితాలు సాధించిన తమ పాఠశాలలో 420మంది విద్యార్థులుండేవారని,పరిస్థితులు దిగజారడంతో ప్రస్తుతం 200 మంది మాత్రమే చదువుతున్నారంటూ కొత్తూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.