కూటమి ప్రభుత్వ సహకారంతో ఆమదాలవలస నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస వద్ద ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో ఆధ్వర్యంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి జెన్‌కో బృందం పరిశీలించిందన్నారు. పవర్ ప్రాజెక్టుకు ఈఆర్‌సీ అనుమతి కూడా ఉందన్నారు. రూ.30 వేల కోట్లతో పవర్ ప్లాంట్ నిర్మాణానికి జెన్‌కో ముందుకు వచ్చిందన్నారు. ఈ పరిశ్రమ రాకతో నియోజకవర్గ ముఖచిత్రం మారిపోతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూమి 800 ఎకరాలు ఉందని, మరో 600 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టప రిహారం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణంతో సుమారు 15 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 3,200 మెగావాట్ల పవర్‌ప్లాంట్ నుంచి వచ్చిన యాష్ వల్ల నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పవచ్చునన్నారు. అలాగే ఈసర్లపేట వద్ద 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి 60 ఎకరాల భూమిని కేటాయించామన్నారు. నాగావళి నదిపై ముద్దాడపేట వద్ద, వంశధార నదిపై పురుషోత్తపురం వద్ద బ్రిడ్జిలు నిర్మించి రహదారుల కనెక్టివిటి పెంచుతామన్నారు.