ప్రకాశం జిల్లాలో నీరు-చెట్టు పనులు చేసి బిల్లులు రాక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఊరట కలగనుంది. పెండింగ్ బిల్లులకు మోక్షం లభించనుంది. అందుకు వీలుగా తక్షణం బిల్లుల వివరాలను అప్‌లోడ్ చేయా లని ప్రభుత్వం ఆదేశించడంతో జలవనరులశాఖ అధికారులు తదనుగుణమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇంకా రూ.23.75కో ట్లకుపైగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించి వర్క్‌ల వారీగా అప్‌లోడ్ చేసే పనిలో ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నీరు-చెట్టు పేరుతో సాగునీటి వనరుల అభివృద్ధి చేపట్టారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, సాగర్‌తోపాటు ఇతర ప్రాజెక్టుల కాలువలు ఇలా అన్ని రకాల నీటి వనరులలో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్, షట్టర్లు, డ్రాప్‌ల పునరుద్ధరణ, మట్టికట్టల పటిష్టతతోపాటు ఇతరత్రా పనులు చేశారు. వర్షపు నీటిని వీలున్నంత మేర నిల్వ చేయాలన్నది ఈ పనుల లక్ష్యం. టీడీపీ కాలంలో ఉమ్మడి జిల్లాలో రూ.400 కోట్ల విలువైన పనులు చేపట్టి 90శాతం పనులు పూర్తి చేశారు. అప్పట్లోనే చేసిన పనులకు సంబంధించి రూ.75శాతం వరకు బిల్లులు చెల్లింపు కూడా జరిగింది.