ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పాడిరైతుల ప్రయోజనార్థం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అవే మినీ గోకులాలు. పాడి ఉన్న రైతులకు వీటిని మంజూరు చేయడం ద్వారా పాల ఉత్పత్తి పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 90 శాతం ఉపాధి మెటీరియల్ నిధులతో ఒక్కో షెడ్ నిర్మాణానికి గరిష్ఠంగా రూ.2.30 లక్షలను మంజూరు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మినీ గోకులాలు నిర్మించేందుకు పాడి రైతులు విపరీతంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక్క నెలలోనే సుమారు 23 వేల షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో ఈ పథకానికి విపరీతమైన ఆదరణ లభించింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టినప్పటికీ అప్పట్లో రైతులు పరిమితంగా షెడ్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి బిల్లులు నిలిపేసి రైతులను ఇబ్బంది పెట్టడంతో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత రైతులకు బిల్లులు చెల్లించారు.