వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు ఎంపీ. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు నిన్న ప్రకటించిన విజయసాయి ఈరోజు ఢిల్లీలోని రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పించినట్లు తెలిపారు. రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామానే కాకుండా రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిందన్నారు. జగన్‌మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని.. ప్రజాదరణ జగన్‌కు తగ్గదని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నానని.. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి అన్ని వివరాలు చెప్పానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని తెలిపారు.