అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పరిధిలోని జాతీయ రహదారిపై ఓ భారీ ట్యాంకర్ నిలిచిఉంది. కాకినాడ పోర్టు నుంచి ఒడిశాలోని బరంపురానికి దీన్ని తీసుకువెళుతున్నారు. సుమారు 100 అడుగుల పొడవు 30 అడుగుల ఎత్తు ఉన్న ఈ ట్యాంకర్ ను ప్రత్యేకంగా 20 మంది సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షణలో తీసుకెళుతున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా పోలీసులు, హైవే నిర్వాహకులు పర్యవేక్షణ చేస్తున్నారు. మార్గంలో అడ్డుగా ఉన్న స్తంభాలు, బోర్డులను తొలగిస్తున్నారు. రోజుకు గరిష్ఠంగా 20 కిలోమీటర్లు మాత్రమే ఇది నడుస్తోంది. జాతీయ రహదారిపై ఇది వెళుతున్న సమయంలో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొన్ని చోట్ల ఒక మార్గంలోనే ట్రాఫిక్ అనుమతించి ట్యాంకరు వెళ్లడానికి ఆటంకం లేకుండా చూస్తున్నారు. శనివారం నక్కపల్లి మండలం కాగిత టోల్గేట్ వద్దకు చేరుకోగా ఇక్కడితో ప్రయాణాన్ని ఆపేశారు. తిరిగి ఆదివారం వాహనం ప్రయాణం కొనసాగిస్తుందని హైవే నిర్వాహకులు వెల్లడించారు.