ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్షన్ దారులు, ఐటీ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 08:11 PM

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం, సంబేపల్లి మండలం మోటకట్లలో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారుల నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు వారికి స్వయంగా పెన్షన్ అందించారు. అంతకముందు సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మోటకట్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెన్షన్ దారులు, ఐటీ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాలెడ్జ్ పెంచుకుని కష్టపడి పనిచేస్తే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. నా మాట నమ్మిన వాళ్లు బాగుపడ్డారు. ఒకప్పుడు నేను ఐటీని ప్రమోట్ చేశాను. అప్పుడు ఎవరికీ ఐటీ అంటే తెలీదు. బిల్ గేట్స్ ఇంటర్నెట్ తీసుకొచ్చాక ప్రపంచమంతా కుగ్రామంగా మారింది. ఇంటర్నెట్ వచ్చాక టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆనాడు ఫైల్స్ మోసుకెళ్లి అమెరికాలో ప్రముఖ కంపెనీల చుట్టూ తిరిగాను. హైటెక్ సిటీ కట్టేందుకు చాలా శ్రమించాను. ఎన్నో సమావేశాలు నిర్వహించాను. హైటెక్ సిటీ చూశాక యువతకు బాగా చదువుకోవాలని ఆశ పుట్టింది. 9 ఏళ్లలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు తెచ్చాను. ఆ కాలేజీలను చూసి యువత చదువుకున్నారు. ప్రపంచమంతా మన తెలుగువాళ్లు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. నేడు అమెరికన్స్ తలసరి ఆదాయం 60 వేల డాలర్లు ఉంటే, అక్కడి మన తెలుగు వారి తలసరి ఆదాయం లక్షా 20 వేల డాలర్లుగా ఉంది. నన్ను అరెస్ట్ చేసినప్పుడు 80 దేశాల్లో తెలుగువారు 53 రోజులు ప్రదర్శన చేశారు. 100 దేశాల్లో మన తెలుగు వారు ఉండటం గర్వ కారణం. ఏపీని వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ గా మారుస్తాం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని ఒక నినాదంగా ప్రచారం చేశాను. కో వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రమ్ హోమ్ తో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుంది. భవిష్యత్ లో గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్నవారికి శిక్షణ అందించి అవకాశాలు కల్పించేందుకు స్పేస్ క్రియేట్ చేస్తాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలు పెడుతున్నాం. ఐదు ప్రాంతాల్లో టాటా ఇన్నవేషన్ హబ్స్ రాబోతున్నాయి. మీ ఊర్లోనే కూర్చుని పనిచేయవచ్చు. వీటితో పాటు వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ అదనంగా సంపాదించవచ్చు.యువగళం పాదయాత్ర సమయంలో లోకేశ్ ఆలోచనలు నుంచి వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్. దీని ద్వారా పౌరులకు 161 ప్రభుత్వ సేవలు అందిస్తున్నాము. ఏడు నెలల్లో చెప్పిన దానికంటే ఎక్కువ పనులు చేసి ప్రజల రుణం తీర్చుకుంటాను. నా తల్లి కష్టం ఏ ఆడబిడ్డకూ రాకూడదని దీపం పథకం పెట్టి దేశంలోనే మొదటిసారి గ్యాస్ అందించాము. ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. త్వరలో ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తాం. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ. 20 వేలు అందిస్తాం. రూ. 6 కోట్లతో ఈ జిల్లాలో గుంతలు లేని రోడ్లు వేశామంటే మీరు ఎంచుకున్న ప్రభుత్వం ఏం చేసిందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఓ వైపు ఐటీ మరోవైపు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాము. రాయలసీమ నేడు ఇలా అయినా ఉందంటే అందుకు ఎన్టీఆర్ కారణం. రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది ఎన్టీఆర్ అయితే నేను వాటిని ముందుకు తీసుకెళ్లాను. 2014-2019 మధ్య నీటి పారుదల ప్రాజెక్టుల కోసం రూ. 64 వేల కోట్ల వ్యయం చేశాము. గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసింది. విధ్వంస పాలనపై ప్రశ్నిస్తే నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. మళ్లీ డయాఫ్రం వాల్ నిర్మించాల్సిన పరిస్థితి తెచ్చారు. మీకు కులాలు, ప్రాంతాలు, మతాలు వద్దు. ఎవరు మనకు న్యాయం చేశారు, ఎవరు ముందు చూపుతో ఆలోచించారు, ఎవరి వల్ల బాగుపడ్డామో మీరు ఆలోచించగలిగారంటే ఎప్పటికీ ఈ ప్రభుత్వానికే ఓటేస్తారు... అని సీఎం చంద్రబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com