మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హామీ ఇచ్చినప్పటి నుంచి.. నక్సల్స్‌కు వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు, భద్రతా బలగాలు.. మావోయిస్టులకు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తరచూ సెక్యూరిటీ ఫోర్స్, నక్సల్స్‌కు మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లాయి. ఈ క్రమంలోనే అడవుల్లో నక్కి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు చోటు చేసుకోగా.. ఆ కాల్పుల్లో 8 మంది నక్సల్స్ చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా అనే కోణంలో భద్రతా బలగాలు, పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.