ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు నియమిస్తూ కూటమి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ప్రభుత్వం ఆయనపై అవినీతి ఆరోపణలు మోపి రెండు పర్యాయాలు సస్పెండ్ చేసింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా, సస్పెన్షన్ కాలాన్ని కూడా ఇన్ సర్వీస్ కింద పరిగణిస్తామని, సస్పెన్షన్ కాలానికి వేతనం, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తామని కొన్నిరోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా, ఆయనకు పోస్టింగ్ కూడా ఇచ్చింది. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవిలో ఏబీ వెంకటేశ్వరరావు రెండేళ్ల పాటు కొనసాగుతారు.