ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికైన అవధేష్ ప్రసాద్ మీడియా సమావేశంలోనే కన్నీరు పెట్టుకున్నారు. 22 ఏళ్ల దళిత యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి.. దారుణంగా చంపిన ఘటనపై ఆయన తీవ్ర భావోద్వేగం అయ్యారు. ఆ యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమెకు న్యాయం జరగకపోతే ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని మీడియా సమావేశంలోనే పేర్కొ్న్నారు. ఇక అవధేష్ ప్రసాద్ మీడియా సమావేశంలోనే ఏడ్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయోధ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఆడ పిల్లలను కాపాడుకోవడంలో మనం విఫలం అవుతున్నామని ఈ సందర్భంగా అవధేష్ ప్రసాద్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ‘‘మర్యాద పురుషోత్తమ రామ, సీతా మాత మీరు ఎక్కడ ఉన్నారు..?’’ అంటూ మీడియా ముందే రోదించారు. అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతానని అవధేష్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో న్యాయం జరగకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.
ఇటీవల అయోధ్య జిల్లాలోని ఒక కాలువలో 22 ఏళ్ల యువతి మృతదేహం కనిపించింది. గురువారం రాత్రి ఒక మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన ఆ యువతి ఇంటికి తిరిగి రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఆ తర్వాత కాలువలో దొరికిన మృతదేహం దుస్తులు లేకుండా, శరీరంపై గాయాలు కనిపించాయని గుర్తించారు. ఆమెను తాళ్లతో కట్టేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ యువతిపై అత్యాచారం, హత్య జరిగిందని నిర్ధారించారు.
మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన అవధేష్ ప్రసాద్.. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం మిల్కిపూర్ ఎమ్మెల్యే పదవికి అవధేష్ ప్రసాద్ రాజీనామా చేశారు. ఈనెల 5వ తేదీన మిల్సీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రసిద్ధ అయోధ్య రామమందిరం నిర్మించిన తర్వాత కూడా ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓటమిపాలైంది.