ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలోని తన అధికారిక నివాసం 1 జన్ పథ్ కు వెళ్లిన చంద్రబాబు... అక్కడ్నించి ఎన్నికల ప్రచారానికి తరలి వెళ్లారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం సాగుతోంది. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు తెలుగువారికి పిలుపు ఇచ్చారు. ఆయన తన సభల్లో తెలుగులోనే ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన అధికారిక ఆప్ ను టార్గెట్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆప్ విఫలమైందని, అదే సమయంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటోందని అన్నారు. తాగునీరు అందించడంలో ఆప్ విఫలమైందని, ప్రధాని మోదీ అమృత్ పథకం కింద స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని వివరించారు. కేంద్రం నిధులు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఆప్ ప్రభుత్వం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ దుర్గంధభరితంగా ఉందని దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. యమునా నది ప్రక్షాళన చేస్తామని 10 ఏళ్లుగా చెబుతున్నారు... కానీ యమునా నది ప్రక్షాళన జరగాలంటే అది మోదీకే సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, ఈ సభకు వచ్చిన వాళ్లు కూడా కాలుష్యం దెబ్బకు ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. "మనకు కావాల్సింది ఆయారాంలు గయారాంలు కాదు... ప్యాలెస్ లు కట్టుకునే వాళ్లు కాదు... ప్రజల కోసం పాటుపడే వాళ్లు కావాలి... అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలి... కమలం గుర్తుకు ఓటేయాలి... ఇక్కడ పోటీ చేస్తున్న సంజయ్ గోయల్ ను గెలిపించాలి... ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో మా కూటమిని నమ్మి ప్రజలు ఓట్లేశారు... వైసీపీని ఇంటికి పంపించారు... డబుల్ ఇంజిన్ సర్కారుకే ప్రజలు ఓట్లేశారు... ఆరు నెలల్లోనే లక్షల కోట్ల అభివృద్ధికి బాటలు వేశాం... ఇక్కడ ఢిల్లీలో ఆప్ ఇంజిన్ సర్కారు కావాలా, మీకు డబుల్ ఇంజిన్ సర్కారు కావాలా?" అని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.