చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల గ్రామంలో ఏర్పాటు చేసిన 'జనంలోకి జనసేన' భారీ బహిరంగ సభకు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగించారు. ఇక్కడ అందరూ పెద్దిరెడ్డికి భయపడతారు... మీరు కూడా జాగ్రత్త అని కొందరు చెప్పారని నాగబాబు వెల్లడించారు. అయితే పెద్దిరెడ్డి కాదు ఇంకే రెడ్డి వచ్చినా తాము భయపడబోమని చెప్పానని తెలిపారు. "పెద్దిరెడ్డికే కాదు వాళ్ల నాయకుడు జగన్ కు, జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికే భయపడలేదు ఇతనెంత! మేం న్యాయంగా, ధర్మంగా ముందుకెళ్లే పవన్ కల్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నాం.మాకు పెద్దిరెడ్డి కాదు కదా సుబ్బారెడ్డి, మరో పిచ్చిరెడ్డి వచ్చినా భయపడేది లేదు" అని నాగబాబు స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి భూ దోపిడీకి పాల్పడ్డాడని, తను దోచుకున్న భూముల రికార్డులు లేకుండా మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేయించాడని ఆరోపించారు. తగలబడిన ఫైళ్లలో చాలావరకు 22ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన పత్రాలేనని సీఐడీ అధికారులు నిర్ధారించారని వివరించారు. కూటమి ప్రభుత్వంలో, తప్పు చేసిన వాళ్లెవరూ తప్పించుకోలేరని నాగబాబు హెచ్చరించారు. శాసనసభ చుట్టుపక్కలకు రావడానికి కూడా వైసీపీ నేతలకు ధైర్యం సరిపోవడంలేదని నాగబాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడంలేదని వైసీపీ నేతలు అంటున్నారని, సభకు వస్తే కదా మైక్ ఇచ్చేది లేనిదీ తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి గొంతుక వినిపించాలని ఈ సందర్భంగా జగన్ రెడ్డికి కూడా చెబుతున్నానని అన్నారు."ఈ పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టాడు. అన్నిటికన్నా సిగ్గు పడాల్సిన విషయం ఏంటంటే... ఓటర్లు ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలని నీకు ఎమ్మెల్యే పదవి దండగ. నీకే కాదు... జగన్ తో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉపయోగం ఏముంది? ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు?" అంటూ నాగబాబు నిలదీశారు. ఇక, వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు చూడాలని హితవు పలికారు. "నోటికొచ్చినట్టు వాగే వైసీపీ సన్నాసులకు చెబుతున్నా... వృద్ధులు, వితంతువుల పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇస్తున్నాం. పెంచిన పెన్షన్లను ప్రతి నెల వాళ్ల ఇళ్ల వద్దేనే ఇస్తున్నాం. దివ్యాంగులకు రెట్టింపు పెన్షన్లు ఇస్తున్నాం. గత జగన్ ప్రభుత్వం వచ్చిన మొదటి నాలుగు నెలల్లో రూ.250 పెన్షన్ పెంచడం తప్ప వేరే ఏ హామీ అమలు మొదలుపెట్టలేదు" అని నాగబాబు విమర్శించారు. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు తెచ్చుకున్నామని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.12 వేల కోట్ల నిధులు సంపాదించుకున్నామని వివరించారు. దీపం పథకం ద్వారా 80 లక్షల మంది లబ్ధిదారులకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని నాగబాబు తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లకు రూ.361 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నామని చెప్పారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయిస్తున్నామని, గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్స్ లు ఏర్పాటు చేశామని వివరించారు. ముఖ్యంగా, మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు... మరోవైపు 6 వేల పోలీసు ఉద్యోగాల నియామకాలకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని... ఉచిత ఇసుక అందించడం ద్వారా పేదలపై ఆర్థికభారం తొలగించామని నాగబాబు వివరించారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో నెం.217, జీవో నెం.144 రద్దు చేశామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రాకతో దాదాపు 20 ప్రముఖ కంపెనీలు రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయని, తద్వారా 4 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10 వేల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. గతంలో లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు.