దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. ఏ రంగంలో అయినా రాణించాలంటే.. మనపై మనకు నమ్మకం ఉండాలని, ఆ తర్వాత కష్టంతో పాటు, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు ఉండాలని అందరిలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. విజయవాడలో ఏపీ బీఎన్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కాంక్లేవ్ 3.0కు జాంటీ రోడ్స్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్‌కతా నుంచి సుమారు 1500 మంది వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాంటీ రోడ్స్ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏ వ్యాపారమైనా వినియోగదారుల్లో నమ్మకం కలిగించాలని, దానిని నిరంతరం కొనసాగిస్తే ఇక తిరుగుండదన్నారు. తాను క్రికెటర్ అవుదామని నిర్ణయం తీసుకుని అడుగులు వేసే సమయంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా నిలబడ్డానని చెప్పారు. చేసే పనిపైన శ్రద్ధ, లక్ష్యాలు సాధించాలనే తపన ఉండాలని వివరించారు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని, వాటిని తట్టుకుని నిలబడాలని.. లోపాలు సరి చేసుకుంటూ ముందుకు సాగితే విజయాలు వరిస్తాయని వ్యాపారవేత్తల్లో ఉత్తేజాన్ని నింపారు.