ఇంగ్లండ్ తో చివరి టీ20లో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. కేవలం 37 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. తొలి 50 పరుగులు చేయడానికి 17 బంతులు ఆడిన అభిషేక్ శర్మ, మరో 50 పరుగులు చేసేందుకు 20 బంతులు ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ వంటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ ఏమాత్రం లెక్కచేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా, ఇంగ్లండ్ స్పిన్నర్లను ఈ లెఫ్ట్ హ్యాండర్ చీల్చిచెండాడు. భారీ సిక్సర్లతో హడలెత్తించాడు. ఐసీసీ టెస్టు హోదా ఉన్న దేశాలపై టీ20ల్లో ఇదే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. గతంలో రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు. నేటి మ్యాచ్ లో ప్రస్తుతం టీమిండియా స్కోరు 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు. అభిషేక్ శర్మ 102 పరుగులు, శివమ్ దూబే 14 పరుగులతో ఆడుతున్నారు. అభిషేక్ శర్మ స్కోరులో 5 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి.