సెప్టిక్ ట్యాంక్ మరణాలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్యాంక్ క్లీన్ చేస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తూ కార్మికులు మృతి చెందితే సదరు ఇంటి యజమానులే బాధ్యులని, బాధిత కుటుంబాలకు వారే పూర్తి పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. చెన్నై మున్సిపల్ కార్మికుడు మృతి కేసులో ఈ మేరకు మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. చెన్నై వినాయగపురానికి చెందిన యోగేశ్బాబు.. తన ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండటంతో 2013 సెప్టెంబరులో దానిని క్లీన్ చేయించారు. ఇందుకు చెన్నై మహానగర కార్పొరేషన్ కార్మికులను పిలిపించారు. వీరిలో మునుసామి అనే కార్మికుడు ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు సోకి అస్వస్థతకు గురై మృతి చెందారు.
దాంతో బాధితుడి కుటుంబసభ్యులకు యోగేష్‌బాబు పరిహారంగా రూ.55 వేలు అందజేశారు. కానీ, ఆ కుటుంబానికి రూ.10 లక్షల పూర్తి పరిహారం అతడే చెల్లించాలని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు పంపింది. ఈ నోటీసులను యోగేశ్బాబు కోర్టులో సవాల్ చేసి.. దానికి తనేలా బాధ్యుడ్ని అవుతానని వాదించారు. తాజాగా, శనివారం ఈ కేసు విచారణకు రాగా.. ప్రైవేట్ వ్యక్తుల సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగితే, దానికి వారే బాధ్యులని, బాధిత కుటుంబానికి పూర్తి పరిహారం వాళ్లే చెల్లించాలని చెన్నై కార్పొరేషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
అంతేకాదు, ఆ మొత్తాన్ని కార్పొరేషన్ ఒకవేళ బాధిత కుటుంబానికి అందజేస్తే... యజమాని ఆ మేరకు కార్పొరేషన్‌కు దానిని చెల్లించాలని, ఇందుకు సంబంధించిన జీవోను మున్సిపల్ శాఖ జారీచేసిందని ఆయన వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు.. చెన్నై కార్పొరేషన్ వాదనతో ఏకీభవించారు. పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓ వ్యక్తి మృతికి బాధ్యుడయ్యారని పేర్కొంది. నిబంధనల మేరకు నోటీసు పంపిన కార్పొరేషన్.. బాధిత వ్యక్తి కుటుంబానికి పరిహారం అందజేసిందని తెలిపింది. కాబట్టి ఆ మొత్తాన్ని పిటిషనర్ నుంచి వసూలు చేయడానికి కార్పొరేషన్ చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం తీర్పు చెప్పింది.