రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్ లతో అరాచాకం సృష్టించి పదవులను దక్కించుకున్నాయని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పదవుల కోసం గుండా రాజ్యం, తాలిబన్ పాలనను తలపించేలా వ్యవహరించారని మండిపడ్డారు. కేవలం ఏడాది కాలం ఉండే పదవుల కోసం నిసిగ్గుగా రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారని అన్నారు. అయన మాట్లాడుతూ..... మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల అప్రజాస్వామిక విధానాలకు పాల్పడ్డాయి. రాష్ట్రంలో మూడు కార్పోరేషన్ల డిప్యూటీ మేయర్ పదవులు, ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి వైస్ చైర్ పర్సన్ ఎన్నికలను రాజకీయ వికృత క్రీడకు మార్చేశారు.
అంతిమంగా అధికార దుర్వినియోగంతో తెలుగుదేశం పార్టీ దొడ్డిదోవన పదవులను దక్కించుకుంది. ప్రజాస్వామ్యంను ఖునీచేశారు. రాష్ట్రంలో మొత్తం 106 మున్సిపాలిటీలు ఉంటే వాటిల్లో 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వాటిల్లో 73 మున్సిపాలిటీల్లో వైయస్ఆర్ సీపీ గెలుపొందింది. కేవలం దర్శి, తాడిపత్రి మున్సిపాలిటీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ప్రభాకర్ రెడ్డి గతంలో మాట్లాడుతూ వైయస్ జగన్ గారు తలుచుకుంటే తాడిపత్రి కూడా వైయస్ఆర్ సీపీ పరం అయి ఉండేదని అన్నారు. అంటే సీఎంగా ఉండి కూడా వైయస్ జగన్ గారు ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించ కూడదంటూ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి విధానాలకు పూర్తి విరుద్దం. ఎలాంటి అడ్డదోవ తొక్కైనా సరే అధికారంలోకి రావాలన్నదే టీడీపీ లక్ష్యం. దానిలో భాగంగానే దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు, కిడ్నాప్ లు, అర్ధరాత్రి దాడులు, కోరం లేకుండా చేసి ఎన్నికలను వాయిదా వేయించడం, నామినేషన్లకు వెడుతున్న వారిని అడ్డుకోవడం వంటి ఘటనలు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా అనేకం జరిగాయని అయన తెలిపారు.